Renuka Chowdhury: ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉండటం సిగ్గుచేటని, ఓ తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌కు లేదా అని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, అందుకే ఎన్నికకు దూరంగా ఉండి నాటకమాడుతున్నాయని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి… “ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆయనకు అండగా నిలబడాలి. కానీ, ఓటింగ్‌కు దూరంగా ఉండటం అంటే బీజేపీతో కుమ్మక్కైనట్టే” అని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్‌ఎస్-బీజేపీ నాటకాలు!
“ప్రజలను మోసం చేయడానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయి. బయట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, లోపల మాత్రం కుమ్మక్కయ్యారు” అని రేణుకా చౌదరి అన్నారు. “ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటం ద్వారా బీఆర్‌ఎస్ తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. ప్రజలు ఈ రెండు పార్టీల నాటకాలను గమనించాలి” అని ఆమె సూచించారు.
తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వడంలో బీఆర్‌ఎస్ పార్టీ విఫలమైందని, ఇది తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయమని ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి విషయాల్లో మద్దతు ఇవ్వాలని, కానీ బీఆర్‌ఎస్ ఆ పని చేయలేదని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.