Delhi

Delhi: ఢిల్లీ పేరు మారుతుందా? కేంద్రానికి బీజేపీ ఎంపీ కీలక లేఖ! కొత్త పేరు ఏంటంటే..

Delhi: దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా? అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీకి దాని అసలు గుర్తింపు తీసుకురావాలని కొంతకాలంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.

ఢిల్లీ పేరును మార్చాలంటూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్, అయోధ్య, వారణాసి వంటి పురాతన నగరాలకు వాటి పాత గుర్తింపులు లభించాయని గుర్తు చేస్తూ, ఢిల్లీని కూడా తిరిగి దాని “అసలు రూపంలో” గౌరవించాలని ఖండేల్వాల్ ఆ లేఖలో కోరారు.

ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని, ఇది కేవలం నగరం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి ఆత్మ అని ఎంపీ పేర్కొన్నారు. పురాణాల ప్రకారం, ఈ నగరాన్ని పాండవులు స్థాపించిన “ఇంద్రప్రస్థ” అని ఆయన గుర్తు చేశారు. కాబట్టి, దేశ రాజధాని పేరును “ఇంద్రప్రస్థ”గా మార్చాలని ఆయన అమిత్ షాను కోరారు. అంతేకాదు, రాజధానిలో పాండవుల గొప్ప విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

నగరంతో పాటు, ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల పేర్లను కూడా మార్చాలని ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని కోరారు. బీజేపీ ఎంపీ తన లేఖను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి అమిత్ షాకు పంపించారు.

అసలు ఈ డిమాండ్ కొత్తదేమీ కాదు. నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ (VHP) కూడా ఢిల్లీ పేరు మార్చాలని కేంద్రాన్ని కోరింది. ప్రాచీన భారతీయ చరిత్ర, మహాభారత కాలం నాటి విషయాలను గుర్తు చేస్తూ ఢిల్లీకి “ఇంద్రప్రస్థ” పేరు పెట్టాలని వీహెచ్‌పీ కూడా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *