Mahaa News Effect: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో చోటుచేసుకున్న ఆక్రమణల తొలగింపు, అలాగే ప్రార్థనా మందిరాల తొలగింపు ప్రతిపాదన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం ఎపి, తెలంగాణ రాష్ట్రాలు ఎపి భవన్ స్థలాన్ని పరస్పర సమ్మతితో పంచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాంగణంలో కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నిర్వహించిన అధ్యయనంలో 0.37 ఎకరాల భూమిలో పలు ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఆక్రమణల తొలగింపు కోసం గత నెల నుంచి చట్టబద్దంగా మరియు సంప్రదింపుల ద్వారానే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఆక్రమణలతో పాటు అదే ప్రాంతంలో ఉన్న రెండు ప్రార్థనా మందిరాల తొలగింపు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజల భావోద్వేగాలు, మతాల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికారులకు స్పష్టంగా సూచించారు. ప్రత్యేకంగా స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేవాలయాల తొలగింపు విషయంలో వచ్చే అభ్యంతరాలపై అధికారులను వివరణ కోరారు.
ప్రార్థనా మందిరాల తొలగింపు వంటి కీలక విషయాల్లో అధిక సంయమనం పాటించాలని అధికారులకు సీఎం అన్నారు. ఈ సూచనల నేపథ్యంలో నిన్నటి నుంచే అధికారులు నిర్మాణాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
తదుపరి చర్యలు ఆయా మతాలకు చెందిన ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్రమైన విధానంతో కొనసాగుతాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.