Tirumala: తిరుమల శ్రీవారిని నిన్న రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. సాధరణ భక్తులతో పాటుగా శుక్రవారం అభిషేక సేవ ఉండటంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో 75 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి వరకు స్వామివారిని 75,096 మంది భక్తులు దర్శించుకోగా, 36,262 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
ఈ ఏడాది మే, జూన్‌లో శుక్రవారాల్లో సాధారణం కంటే అదనంగా 10వేల మందికి పైగా భక్తులకు శ్రీవారిని దర్శించుకున్నారు. సమ్మర్ హాలీడేస్ రావడంతో మే నుంచి భక్తుల తాకిడి బాగాద పెరిగింది. శుక్రవారాలైన మే 23న 74,374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది, జూన్ 13న 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని అందించాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన దోపిడీని అరికట్టడంతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉచిత రవాణా: తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి తిరుమల కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
లక్ష్యం: ప్రైవేట్ వాహనదారుల అధిక ఛార్జీల దోపిడీని అరికట్టడం, భక్తులకు ఆర్థిక భారం తగ్గించడం.
సేవలు: రోజువారీ బస్సు సర్వీసుల సంఖ్యను భక్తుల రద్దీ ఆధారంగా పెంచే అవకాశం.
అమలు: ఈ ప్రతిపాదన ఇంకా చర్చలో ఉంది, ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం తర్వాత అమలు తేదీ ప్రకటించబడవచ్చు.