Am Maaya Chesave: గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చింబు, త్రిష జంటగా నటించిన చిత్రం ‘విన్నైతాండి వరువాయా’. తెలుగులో ఇదే సినిమా నాగచైతన్య, సమంతతో ‘ఏం మాయ చేశావే’ పేరుతో రూపొందింది. ఫిబ్రవరి 26, 2010లో తమిళ, తెలుగు భాషల్లో ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతంతో విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రెండున్నర సంవత్సరాల క్రితం తమిళంలో రీరిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెన్నై అన్నానగర్ పివిఆర్ థియేటర్ లో ఈ సినిమా స్క్రీనింగ్ అవుతూనే ఉందట. సోమవారం 1000 రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్భంగా అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రీరిలీజ్ లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. మరి దీనిని భవిష్యత్ లో ఏ చిత్రం బ్రేక్ చేస్తుందో చూడాలి.
