RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కప్పు గెలిచిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇటీవల జరిగిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అంబుడ్స్‌మన్ ఆర్‌సీబీకి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఐపీఎల్ విజయం తరువాత, ఆర్‌సీబీ జట్టు విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు దాదాపు 5 లక్షల మంది అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ భారీ జన సందోహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. ఆర్‌సీబీ చేసిన ప్రకటనలే ఇంత పెద్ద ఎత్తున జనం రావడానికి కారణమని కర్ణాటక హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది.
ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ జూన్ 12న బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆర్‌సీబీ, కేఎస్‌సీఏల నుండి రాతపూర్వక వివరణ కోరారు. విజయోత్సవ వేడుకలలో జట్టు తీవ్ర నిర్లక్ష్యం, భద్రతా నిబంధనల ఉల్లంఘన, మృతుల అంశాలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
Also Read: SpiceJet: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్..వణికిపోయిన ప్రయాణికులు
RCB: ఫిర్యాదుదారుడు ఆర్‌సీబీ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, భద్రతా నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. అంతేకాకుండా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రస్తుత యజమానులు ఫ్రాంచైజీని విక్రయించకుండా నిషేధించాలని కూడా ఫిర్యాదుదారు కోరారు.
ఆర్‌సీబీ, కేఎస్‌సీఏలు తమ లిఖితపూర్వక సమాధానాలను నాలుగు వారాల్లోగా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు సమర్పించాలి. ఆ సమాధానాల కాపీని ఫిర్యాదుదారునికి కూడా ఇవ్వాలి. అంబుడ్స్‌మన్ దీనిపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాంచైజీ జవాబుదారీతనం నుంచి తప్పించుకునే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నందున, దర్యాప్తు పూర్తయ్యే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ సూచించారు. ఈ ఘటన ఆర్‌సీబీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది.

