IPL 2025 Final RCB vs PBKS

RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?

RCB Name Change: 2026 ఐపీఎల్‌కు కేవలం కొని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆర్‌సీబీ ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్ముడయ్యాయి. ఈ రెండు ఫ్రాంచైజీల అమ్మకపు ధర క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 16,700 కోట్లకు అమ్ముడుపోయి కలకలం సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్‌సీబీని రికార్డు ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఫ్రాంచైజీ అమ్ముడుపోయినప్పటి నుండి అభిమానుల మదిలో ఒక ప్రశ్న తలెత్తింది. సాధారణంగా, ఐపీఎల్‌లో యాజమాన్యం మారినప్పుడు లేదా బ్రాండ్ రీబ్రాండింగ్ అవసరం వచ్చినప్పుడు, జట్లు తమ పేర్లను మార్చుకోవడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో, ఆర్‌సీబీ పేరు కూడా మారుతుందా అనే దానిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.

అనన్య బిర్లా వివరణ

సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చల మధ్య, ఆదిత్య బిర్లా గ్రూప్‌లో ప్రముఖ వ్యక్తి అయిన అనన్య బిర్లా స్వయంగా ఊహాగానాలకు తెరదించారు. జట్టు పేరు మార్పు వార్తలపై అనన్య బిర్లా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరోక్షంగా స్పందించారు. దీనికి సంబంధించి అనన్య బిర్లా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఆర్‌సిబి పేరు మార్చబడదని స్పష్టం చేశారని ఎన్‌డిటివి మరియు రిపబ్లిక్ న్యూస్ వెబ్‌సైట్లు నివేదించాయి.
ఆర్‌సిబి కేవలం ఒక జట్టు పేరు కాదు. అది ఒక భావోద్వేగం. ప్రపంచవ్యాప్తంగా దాని బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయాలని కొత్త యజమానులు కోరుకోవడం లేదని ఇది చూపిస్తుంది. దీనితో, ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)’ అనే ప్రతిష్టాత్మకమైన పేరు కొనసాగుతుందని స్పష్టమవుతోంది. 
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుండి ఆర్‌సిబిని కొనుగోలు చేసిన కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్ మాత్రమే కాకుండా, ఇతర అంతర్జాతీయ మరియు జాతీయ దిగ్గజాలు కూడా ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ మరియు అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ యొక్క బోల్ట్ వెంచర్స్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ ఒప్పందం కేవలం ఐపీఎల్ జట్టుకే పరిమితం కాదు, ఇందులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోని ఆర్‌సీబీ మహిళల జట్టు హక్కులు కూడా ఉన్నాయి. ఇంత భారీ పెట్టుబడితో, ఈ కంపెనీలు ఆర్‌సీబీ బ్రాండ్ విలువను మరింత పెంచే దిశగా ఒక అడుగు వేస్తున్నాయి.
అభిమానుల ఆనందం

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఉన్న జట్లలో ఆర్‌సిబి ఒకటి. ఈ జట్టుపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, 2025లో ఆర్‌సిబి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది, ఇది జట్టు విలువను అపారంగా పెంచింది. ఇప్పుడు, కొత్త యాజమాన్యం రాకతో, జట్టులో మార్పులు వస్తాయని భయపడిన అభిమానులు, జట్టు పేరు మారదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. పేరు మారనప్పటికీ, కొత్త యజమానుల ఆధ్వర్యంలో మరింత అధునాతన సౌకర్యాలు, మెరుగైన వ్యూహాలతో ఆర్‌సిబి నిలకడగా ట్రోఫీలు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తంగా, ఆర్‌సిబి పేరు అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది. బిర్లా గ్రూప్ రాకతో, జట్టు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *