WPL 2026: నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఐదో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనవిజయం సాధించింది. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 12.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించి, 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, +1.964 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు, వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్న యూపీ వారియర్స్ పాయింట్లు ఏమీ లేకుండా చివరి స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ సారథ్యంలోని యూపీ జట్టు ఒక దశలో 8.2 ఓవర్లలో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే ఆరో వికెట్‌కు దీప్తి శర్మ (45 నాటౌట్), డియాండ్రా డాటిన్ (40 నాటౌట్) అజేయంగా 93 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఆర్సీబీ బౌలర్లలో నడైన్ డి క్లెర్క్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: సొంతూరిలో సంక్రాంతి పండుగ.. నాలుగు రోజుల పాటు ఊర్లోనే సీఎం చంద్రబాబు!
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ వీరవిహారం చేసింది. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హారిస్‌కు తోడుగా కెప్టెన్ స్మృతి మంధాన 32 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గ్రేస్ హారిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ ఇన్నింగ్స్‌తో హారిస్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 110 పరుగులతో మూడో స్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ జెయింట్స్ క్రీడాకారిణి సోఫీ డివైన్ 133 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆమె సహచర క్రీడాకారిణి యాష్లే గార్డనర్ 114 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, యూపీ వారియర్స్ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 98 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. బౌలింగ్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం నందిని శర్మ రెండు మ్యాచ్‌ల్లో 7 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, నడైన్ డి క్లెర్క్ 6 వికెట్లతో రెండో స్థానంలో నిలిచింది. చండీగఢ్‌కు చెందిన 24 ఏళ్ల నందిని శర్మ, గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
