RBI: బ్యాంకు ఖాతాదారులు, లాకర్ల యజమానులు మరణించిన తర్వాత క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నామినీలు, చట్టబద్ధ వారసులకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఎలాంటి ఆలస్యం జరగకుండా, సులభంగా సేవలు అందించడమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం.
ఈ కొత్త నిబంధనలను ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెటిల్‌మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్స్) డైరెక్షన్స్ 2025’ పేరుతో విడుదల చేశారు. వీటిని 2026 మార్చి 31 లోపు అన్ని బ్యాంకులు అమలు చేయాల్సి ఉంటుంది.
క్లెయిమ్స్ పరిష్కారానికి 15 రోజుల గడువు:
మరణించిన ఖాతాదారుల తరపున నామినీ లేదా వారసుల నుంచి క్లెయిమ్ అందిన తేదీ నుంచి 15 క్యాలెండర్ దినాలలోపు సెటిల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఒకవేళ సరైన కారణం చూపకుండా 15 రోజుల్లోగా క్లెయిమ్ పరిష్కారం కాకపోతే, బ్యాంకులు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలి. ఆలస్యమైన కాలానికి, ఆ ఖాతాపై బ్యాంక్ అమలు చేస్తున్న సాధారణ వడ్డీకి అదనంగా 4% వార్షిక వడ్డీని కలిపి చెల్లించాలి.
సేఫ్ డిపాజిట్ లాకర్లు/కస్టడీ వస్తువుల విషయంలో: ఆలస్యమైన ప్రతి రోజుకూ రూ. 5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Tirumala: ‘ఏఐ’తో ప్రసాదాల నాణ్యత పెంపు.. టిటిడి సరికొత్త అడుగు
నామినీ లేకున్నా సులభతర విధానం:
ఖాతాదారు నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించకపోయినా, క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు ఆర్‌బీఐ ప్రక్రియను సరళతరం చేసింది.
నామినేషన్ లేని ఖాతాలకు పరిమితి: నామినీ లేదా సర్వైవర్‌షిప్ క్లాజ్ లేని ఖాతాల్లోని మొత్తాన్ని ఈ క్రింది పరిమితుల వరకు బ్యాంకులు సులభతర పద్ధతిలో సెటిల్‌మెంట్ చేయవచ్చు:
సహకార బ్యాంకులు: రూ. 5 లక్షల వరకు.
ఇతర బ్యాంకులు (కమర్షియల్ బ్యాంకులు): రూ. 15 లక్షల వరకు.
ఈ పరిమితికి మించి ఎక్కువ మొత్తం ఉంటే, బ్యాంకుల బోర్డుల అనుమతితో వారసత్వ ధ్రువపత్రం (Succession Certificate) వంటి చట్టబద్ధ పత్రాలను కోరవచ్చు. ఖాతాలో నామినేషన్ లేదా సర్వైవర్‌షిప్ క్లాజ్ ఉంటే, ఆ మొత్తాన్ని నామినీకి/సర్వైవర్‌కు వెంటనే బదిలీ చేయాల్సిన బాధ్యత బ్యాంకుదే. ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తే, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తొలగి, బ్యాంకింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారుతుందని ఆర్‌బీఐ ఆశిస్తోంది.