Ravichandran Ashwin: టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న అశ్విన్, ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పడంతో ఆయన క్రికెట్ కెరీర్‌లో ఒక శకం ముగిసినట్టయింది.
రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ, ఐపీఎల్‌లో తన ప్రయాణం ముగిసిందని, ఇది ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులు, బీసీసీఐ మరియు అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇతర లీగ్‌లలో ఆడటానికి అందుబాటులో ఉంటానని కూడా స్పష్టం చేశారు.
Also Read: Farveez Maharoof: ఆసియా కప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్: ఫర్వేజ్ మహరూఫ్
38 ఏళ్ల అశ్విన్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రారంభించారు. ఆ తర్వాత రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 221 ఐపీఎల్ మ్యాచ్‌లలో, అశ్విన్ 187 వికెట్లు పడగొట్టి, 7.20 ఎకానమీ రేటుతో అత్యుత్తమ ఆఫ్-స్పిన్నర్లలో ఒకరిగా నిలిచారు. బంతితోనే కాకుండా, బ్యాట్‌తో కూడా రాణించి, ఒక అర్ధ సెంచరీతో కలిపి 833 పరుగులు చేశారు.
2010, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించారు. తన స్పిన్ మాయాజాలంతో జట్టు విజయాలకు ఎన్నోసార్లు దోహదపడ్డారు. చివరి సీజన్‌లో, 2025లో, చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి ఆడిన అశ్విన్, 9 మ్యాచ్‌లలో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసి అభిమానులను నిరాశపరిచారు. అయినప్పటికీ, ఆయన ఐపీఎల్ కెరీర్ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని అధ్యాయంగా నిలిచిపోతుంది.

