Ravi Shastri: భారత మాజీ క్రికెట్ కోచ్ రవిశాస్త్రి, యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత క్రికెట్‌లో గిల్ ఒక రైజింగ్ స్టార్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని స్వీకరించిన తర్వాత అతని ఆటతీరులో వచ్చిన పరిణితిని రవిశాస్త్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లలో ఎవరు రైజింగ్ స్టార్ అని అడిగితే, తన సమాధానం కచ్చితంగా శుభ్ మాన్ గిల్ అని శాస్త్రి అన్నారు.
అతను చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గిల్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. నాలుగు సెంచరీలతో సహా 754 పరుగులు చేసి, ఈ పర్యటనలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 25 ఏళ్ల వయసులో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, గొప్ప ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని శాస్త్రి మెచ్చుకున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల తర్వాత ఖాళీ అయిన స్థానాన్ని గిల్ అద్భుతంగా భర్తీ చేశాడని చెప్పారు. గిల్ బ్యాటింగ్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని శాస్త్రి వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడి లేకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం అతనికి ఉందని చెప్పారు. ఈ ప్రదర్శనతో గిల్ టెస్ట్‌తో పాటు ఇతర ఫార్మాట్‌లలో కూడా మరింత ముఖ్యమైన ఆటగాడిగా ఎదగగలడని నిరూపించుకున్నాడని అన్నారు.