ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రేపు కోర్టు వాదనలు కొనసాగనున్నాయి. కాగా, అతని దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్సర్(21) తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు.
ఈ ఘటనలో బాధితురాలిని విచారించిన పోలీసులు.. అనంతరం బాధితురాలి వయసు రిత్యా జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటికే జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగాయి. నెల్లూరు, లద్ధాక్ లల్లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. జానీ మాస్టర్ ను సెప్టెంబర్ 19న గోవాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అక్కడ కోర్టు అనుమతితో హైదరబాద్ తరలించారు. మరుసటి రోజు ఉదయం ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపర్చారు పోలీసులు. దీంతో కోర్టు, జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని.. తనపై కుట్ర చేశారని జానీ మాస్టర్ మీడియాతో పేర్కొన్నారు. ఈ ఘటనలో జానీమాస్టర్ కు పలువురు మద్దతు పలుకుతుండగా.. మరికొంతమంది విమర్శిస్తున్నారు.