AV Ranganath: గాజులరామారంలో నకిలీ పట్టాలు, డాక్యుమెంట్లతో ఆక్రమించిన భూముల కూల్చివేతలపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ రంగనాథ్ స్పందించారు. ఈ ఆక్రమణల విలువ దాదాపు రూ. 15,000 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు.
కేవలం 30 శాతం కూల్చివేతలే పూర్తయ్యాయి
“ఈ ఆక్రమణల్లో కేవలం 30 శాతం మాత్రమే కూల్చివేశాం. కూల్చివేసినవి కూడా నిర్మాణంలో ఉన్న భవనాలే. మిగిలిన వాటిపై చర్యలు కొనసాగుతాయి” అని రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్రమణలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
సోషల్ మీడియాలో ఈ కూల్చివేతలపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రంగనాథ్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటోందని, భూములు కోల్పోయిన అసలు యజమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఆక్రమణల వెనుక ఎవరు ఉన్నా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రంగనాథ్ పేర్కొన్నారు.