Ranganath: హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి పర్యటనకు రానుండగా, అప్పటి వరకు అభివృద్ధి పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈరోజు కమిషనర్ రంగనాథ్ స్వయంగా బతుకమ్మ కుంటను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు. న్యాయస్థానం నుంచి అవసరమైన అనుమతులు లభించడంతో అభివృద్ధి పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్ల నిధులతో ఈ పునరుద్ధరణ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని ఆయన తెలిపారు.
మోకాలు లోతు వరకు మట్టిని తొలగించగానే చెరువు యొక్క అసలు ఆకృతి కనిపించిందని, దీన్ని ఒక పూర్తి స్థాయి చెరువుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటికి ఈ చెరువును సిద్ధంగా ఉంచి, ఉత్సవాలను ఇక్కడే నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా హైడ్రా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. చెరువు అభివృద్ధికి స్థానిక ప్రజల సహకారం విశేషంగా దక్కుతోందని, ఈ మద్దతుతో పనులు మరింత వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. వర్షపు నీరు చెరువులోకి సజావుగా ప్రవహించేలా, అలాగే మిగతా నీరు బయటకి వెళ్లేలా ఇన్‌లెట్ మరియు ఔట్‌లెట్ వ్యవస్థలను బలంగా ఏర్పరచాలని ఆయన అధికారులకు సూచించారు.