Ranganath: ఒవైసీ కళాశాలలపైనే ఎందుకు ఆసక్తి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవేదన

Ranganath: ఒవైసీ కళాశాలల విషయాన్ని తీసుకుని పదేపదే ప్రశ్నలు వేస్తూ హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు, స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించిన ఆయన, నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హైడ్రా సామాజిక కోణంలోనే పనిచేస్తోంది. మేము ఏ కళాశాల అయినా వేరుగా చూడం. ఒవైసీ కళాశాలలపై మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? 2015–16లో ఆ కళాశాలలు నిర్మించబడ్డాయి. సల్కం చెరువు ప్రాంతానికి 2016లో మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. ఈ విషయాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అని అన్నారు.

 

మూసీ నదికి సంబంధం లేకున్నా…

హైడ్రాను మూసీ నదికి అనుసంధానిస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. నగరంలోని 540 చెరువులకు పదేళ్ల క్రితమే కేవలం ప్రాథమిక నోటిఫికేషన్లు మాత్రమే జారీ చేశారని, ఇప్పటివరకు కేవలం 140 చెరువులకే తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్నారు. “సల్కం చెరువు నోటిఫికేషన్ ప్రక్రియలో ఉంది. ఇందులో అసత్య ప్రచారాలకు తావే లేదు. ఈ నేపథ్యంలో ఎవరి కొచ్చినట్లుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు” అని విమర్శించారు.

పేదల్ని ముద్దుపెట్టుకుంటూ పెద్దలు తప్పించుకుంటున్నారు

“పేదల మీద హైడ్రా పగబట్టినట్టు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అనధికార నిర్మాణాల వెనుక కొంతమంది ‘పెద్దలు’ ఉన్నారు. వారు తాము తప్పించుకునేందుకు పేదలను ముందు చేస్తున్నారు” అని ఆరోపించారు. హైడ్రా విధిగా చర్యలు తీసుకుంటుందని, ఆక్రమణలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని తెలిపారు.

బతుకమ్మ సంబరాలకు సిద్ధం

ఈ ఏడాది సెప్టెంబరులో బతుకమ్మ పండుగను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మకుంట వద్ద ప్రారంభించనున్నట్టు తెలిపారు. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kavita: వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *