RAMACHANDRA RAO: బీజేపీలో కొత్త, పాత అనే తేడా లేదు.. ట్రోల్ చేస్తే జైల్లో పెడతా..

RAMACHANDRA RAO: బీజేపీలో కొత్తవారు, పాతవారన్న తేడా లేదని, పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులేనని తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. “బిడ్డ పుట్టగానే కుటుంబంలో సభ్యుడవుతాడు కదా, అలాగే బీజేపీలో చేరిన ప్రతి కార్యకర్త మా కుటుంబంలో భాగమే” అని చెప్పారు. పార్టీకి కొత్త సభ్యుల రాకతో నది ప్రవహించినట్లు పార్టీకి ఉత్సాహం, శక్తి వస్తుందని అన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక
హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రామచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. బీజేపీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఈ మేరకు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిచేతుల మీదుగా రామచందర్ రావు అధ్యక్ష పదవికి బాధ్యతలు స్వీకరించారు.

“పేరుకే అధ్యక్షుడిని, కానీ నిజానికి కార్యకర్తనే”
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, “నేను పేరుకే అధ్యక్షుడిని కానీ, ఎప్పటికీ కార్యకర్తను. మీ సేవకుడినే. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో కార్యకర్తలే నిజమైన శక్తి” అన్నారు. బీజేపీ ఎదుగుదల వెనుక కార్యకర్తల త్యాగాలే ఉన్నాయని, పార్టీ అభివృద్ధి వారి చెమటతో సాధ్యమైందని కొనియాడారు.

“నక్సలైట్ల తూటాలకు బలైన నేతల త్యాగాలతో పార్టీ ఎదిగింది”
“నాకు కూడా నక్సలైట్ బెదిరింపులు ఎదురయ్యాయి. ఎబీవీపీ రోజుల్లోనే జైలు జీవితాన్నీ, పోలీసుల లాఠీ దెబ్బల్నీ ఎదుర్కొన్నాను. చేతులు కాళ్లు విరగిపోయినా, సిద్ధాంతాన్ని వదలలేదు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాను” అని తెలిపారు.

బీజేపీ = మాస్ క్యాడర్ + సిద్ధాంత బలం
బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ అని, బలమైన సిద్ధాంతాల మీద ఆధారపడ్డ పార్టీ అని రామచందర్ రావు చెప్పారు. తెలంగాణ యువతను, మహిళలను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ, “బీజేపీలో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లతో గొప్ప అవకాశాలున్నాయి” అని హామీ ఇచ్చారు. “తెలంగాణ ప్రజలందరూ బీజేపీవైపు చూస్తున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ గెలుపే మా లక్ష్యం” అని స్పష్టంచేశారు.

“ఫేక్ న్యూస్ ట్రోల్స్ – నేరుగా ఎదురొస్తే చూసేద్దాం”
“బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాట్సాప్ వర్శిటీలు పెట్టుకుని ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తూ బీజేపీని ట్రోల్ చేస్తున్నాయి. మీకు ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా తలపడండి. వెనక నుంచి దాడి చేయకండి” అని హెచ్చరించారు. తాను క్రిమినల్ లాయర్‌గా ఉన్నందున ఫేక్ న్యూస్ వెదజల్లే వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

ALSO READ  Ambati Rambabu: కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్టుపై అంబ‌టి రాంబాబు ట్వీట్..

“సౌమ్యుడినే కానీ యుద్ధంలో యోధుడిని”
“నేను సౌమ్యంగా కనిపించవచ్చు కానీ అవసరమైతే యుద్ధంలో యోధుడిగా మారుతాను. విద్యార్థుల కోసం, పేదల కోసం, న్యాయవాదుల కోసం న్యాయ పోరాటాలు చేశాను. ఇకపై తెలంగాణ ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటానికి సిద్ధంగా ఉన్నాను” అని ధైర్యంగా చెప్పారు.

“ఐక్యంగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి”
తన నేతృత్వంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా పని చేసి, పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలన్నదే లక్ష్యం అని రామచందర్ రావు పేర్కొన్నారు.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *