Ram gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల అనంతరం దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు చర్చనీయాంశంగా మారిన వేళ, వర్మ కుక్కల ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సందేశాల్లో వర్మ ఇలా ప్రశ్నించారు:
“కుక్కలు నిజంగా మీకు కుటుంబ సభ్యులే అయితే, వాటినే ఎందుకు పెళ్లి చేసుకోరాదు?”
“పేదలందరినీ మీ ఇళ్లలోకి తీసుకుని, వీధులను పూర్తిగా కుక్కలకే వదిలేయొచ్చు కదా?”
అంతేకాకుండా పాలకుల మౌనం కంటే వీధికుక్కల అరుపులే మేలని, అందుకే పాలకుల స్థానంలో వాటినే కూర్చోబెట్టాలి అని సెటైర్ వేశారు.
తన వ్యంగ్యాన్ని మరింత పదును పెంచుతూ, వర్మ మరో ప్రశ్న కూడా లేవనెత్తారు:
“మీ పిల్లలను వీధికుక్కల గుంపుతో ఆడించడానికి పంపి, ప్రకృతితో బంధం పెంచమని చెబుతారా?”
కుక్కలకు పిల్లలతో సమాన హక్కులు ఉన్నాయని భావిస్తే, వీధికుక్కల కోసం పాఠశాలలు, పిల్లల కోసం కెన్నెల్స్ నిర్మించాలని ఎద్దేవా చేశారు. అనారోగ్యం వస్తే ఆసుపత్రి బదులు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లండి అని శునక ప్రియులకు సలహా ఇచ్చారు.
అంతేకాకుండా, “కుక్కలను దేవుళ్ల కంటే ఎక్కువగా పూజిస్తున్నారంటే, దేవాలయాల్లోని విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో కుక్కలను పెట్టి మోక్షం కోసం ప్రార్థించండి” అంటూ మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థిస్తుండగా, జంతు ప్రేమికులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు.