Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను కలవరపెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఒక భారీ స్టంట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్‌కు స్వల్ప గాయమైంది. ఈ ఘటనతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
అసలేం జరిగింది?
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాకు సంబంధించి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను గచ్చిబౌలిలో చిత్రీకరిస్తున్నారు. బుధవారం షూటింగ్ జరుగుతుండగా ఒక కఠినమైన ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో చరణ్ కింద పడటంతో గాయపడినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదని, కేవలం స్వల్ప గాయమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, గాయం తీవ్రత పెరగకుండా ఉండటానికి వైద్యులు ఆయనకు కొన్ని రోజులు విశ్రాంతి (Bed Rest) తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రస్తుతానికి చరణ్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు.
పవన్ కళ్యాణ్ స్పందనతో వెలుగులోకి..
నిజానికి చరణ్ గాయంపై ‘పెద్ది’ చిత్ర యూనిట్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా టీమ్ ద్వారా స్పందించడంతో ఈ వార్త నిజమని తేలిపోయింది. “నా ప్రియమైన చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ ఒక సందేశాన్ని పంచుకున్నారు. బాబాయ్ చేసిన ఈ పోస్ట్‌తో చరణ్‌కు గాయమైందనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రిలీజ్ డేట్‌పై నీలినీడలు?
షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడం, ఇప్పుడు చరణ్ గాయపడటంతో సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కోలుకోవడానికి కనీసం వారం నుండి పది రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో విడుదల తేదీ మారే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
