Rakul Preet Singh: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్‌కు పరిమితమయ్యారు. ఆమె గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, బాలీవుడ్‌లో కూడా ఆశించిన స్థాయిలో హిట్లు రాక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
రకుల్ కెరీర్‌లో 2019లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’ (De De Pyaar De) తర్వాత సరైన విజయం దక్కలేదు. ఇటీవల ఆమె నటించిన తమిళ డబ్బింగ్ చిత్రాలు ‘అయలాన్’, ‘ఇండియన్ 2’ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. గత ఏడాది విడుదలైన హిందీ సినిమా ‘మేరీ హస్బెండ్ కీ బీవీ’ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించలేకపోయింది.
Also Read: Dil Raju-Salman Khan: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?
వివాహం తర్వాత ప్రాజెక్టుల ఎంపికలో రకుల్ చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఆమె ప్రస్తుతం తన ఆశలన్నీ ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ (De De Pyaar De 2) పైనే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆమె మరోసారి అజయ్ దేవగణ్‌తో కలిసి నటించనున్నారు. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఆమె తప్పకుండా హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు.
మరోవైపు, రకుల్ ‘పతి పత్నీ ఔర్ ఓ2’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీలతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్ 3’లో ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ పురోగతిపై ఇంకా స్పష్టత లేదు.
‘కొండ పొలం’ చిత్రం తర్వాత రకుల్ తెలుగు తెరపై కనిపించలేదు. గతంలో టాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరితో కలిసి నటించిన రకుల్‌కు ఇప్పుడు తెలుగులో కొత్త అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ పంజాబీ సుందరి తెలుగు సినీ పరిశ్రమకు దాదాపుగా దూరమైనట్లే కనిపిస్తోంది. ఆమె తిరిగి తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.