Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో వర్కవుట్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ గాయం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ బ్యూటీ స్వయంగా వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న రకుల్, తన ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. “జిమ్‌లో జరిగిన గాయం నాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలించింది. ఆ సమయంలో నిర్లక్ష్యం చేశాను కానీ, తర్వాత దాని తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు.. కానీ కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాను,” అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, ఈ గాయం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, జీవితంలో జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో తెలిసొచ్చిందని రకుల్ వివరించింది. “అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు ఆచితూచి అడుగులు వేయడం చాలా అవసరం. మొదట్లో గాయాన్ని తేలిగ్గా తీసుకున్నా, చికిత్స చేయించుకునే సమయానికి పరిస్థితి సీరియస్ అయ్యింది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వారం రోజులకే అర్థమైంది. ఇప్పుడు ధైర్యంగా దీన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నా,” అని రకుల్ ఎమోషనల్‌గా తెలిపింది. ఈ ఘటన ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి!