Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ భారత ఆర్మీ పాత్ర వెలకట్టలేనిది: రాజ్‌నాథ్ సింగ్

Operation Sindoor: దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ‘ఆపరేషన్ సింధూర్’పై పార్లమెంటులో వాడీవేడి చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించి, భారత సైన్యం సాధించిన గొప్ప విజయాన్ని ప్రశంసించారు. దేశ ప్రజలను కాపాడటం తమ ప్రభుత్వ ముఖ్య బాధ్యత అని ఆయన గట్టిగా చెప్పారు. పహల్గాం దాడికి ప్రతీకారం: ‘ఆపరేషన్ సింధూర్’తో వంద మందికి పైగా ఉగ్రవాదుల హతం అయ్యారు.

పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపడం దారుణమని అన్నారు. ఈ దాడికి ప్రతీకారంగానే ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టామని తెలిపారు. ఈ ఆపరేషన్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేశారని వివరించారు. మే 7వ తేదీ రాత్రి భారత బలగాలు తమ శక్తిని చాటిచెప్పాయని, కేవలం 22 నిమిషాల్లోనే ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసి, వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని మంత్రి ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే), పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయని, ‘సింధూర్’ అనేది వీరత్వానికి, శౌర్యానికి గుర్తు అని ఆయన పేర్కొన్నారు.

పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన భారత బలగాలు
‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత పాకిస్తాన్ సైన్యం మనపై దాడికి దిగిందని, అయితే దాయాది దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మన సైనికులు క్షిపణులతో దాడి చేయడంతో పాకిస్తాన్‌లోని క్షిపణి లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైందని తెలిపారు. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని, మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని ఆయన అన్నారు. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపి, ఉగ్రవాదులను లోపలికి చొచ్చుకెళ్లి మరీ హతమార్చారని వివరించారు. భారత్ చేసిన ఈ దాడులను అనేక దేశాలు సమర్థించాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

సరిహద్దులు దాటి వెళ్లడం ‘ఆపరేషన్ సింధూర్’ లక్ష్యం కాదని, యుద్ధం తమ లక్ష్యం కాదని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. దాడుల అనంతరం పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, తమ త్రివిధ దళాలను తట్టుకోలేక పాకిస్తాన్ డీజీఎంఓ వెంటనే తమకు ఫోన్ చేశారని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

Also Read: Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్’ విజయవంతం..ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం

మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం స్పష్టంగా కనిపిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భుజ్, ఉధంపూర్ స్థావరాలకు వెళ్లి మన సైనికుల గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని, ఇలాంటి విషయాల్లో ఆలోచించి ప్రశ్నలు అడగాలని హితవు పలికారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు భారత భూభాగం, సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కొందరు విపక్ష సభ్యులు మన విమానాలు ఎన్ని కూలాయని అడుగుతున్నారని, వారి ప్రశ్నల్లో జాతీయ భావం కనిపించట్లేదని రాజ్‌నాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామని, ఈ ఆపరేషన్‌లో మన సైనికుల్లో ఒక్కరు కూడా గాయపడలేదని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతుపై మండిపడిన రాజ్‌నాథ్ సింగ్
40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత సైనికుల చర్యలను వాజ్‌పేయీ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉందని, యుద్ధాలు కోరుకోమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తామని, తుపాకులు పేలితే ఎవరూ మిగలరని అన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ అధికారులు పాల్గొన్నారని, దీనిని బట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలుస్తోందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఇప్పటివరకు భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని, పాకిస్తాన్ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. భారత స్నేహహస్తాన్ని పాకిస్తాన్ అందుకోలేకపోయిందని, తమ దేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఆ దేశానికే ఇబ్బందిగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *