Rajinikanth: తలైవా రజినీకాంత్ రిటైర్మెంట్ గురించి కోలీవుడ్‌లో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రజినీ మరో రెండు భారీ ప్రాజెక్టులు చేయనున్నారని సమాచారం. వాటిలో ఒకటి ప్రముఖ దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో రూపొందనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అరుణాచలం’ సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అందుకే మళ్లీ ఈ జంట కలవడం మీద అభిమానుల్లో భారీ హైప్ ఏర్పడింది. ఆ తర్వాత రజినీ, కమల్ హాసన్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారని టాక్.
అయితే, ఇదే సినిమా ఆయన కెరీర్‌లో చివరిదని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజినీ ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారన్న ఈ వార్త అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. సోషల్ మీడియాలో “తలైవా సినిమాలు మానేయకండి” అంటూ నెటిజన్లు రిక్వెస్టులు చేస్తున్నారు.
Also Read: Jaanvi Ghattamaneni: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!
రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టారు. మధ్య మధ్యలో హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసే ఆయన, “నా జీవితం సినిమానే… నేను బ్రతికున్నంతవరకు నటిస్తూనే ఉంటా” అని పలుమార్లు పేర్కొన్నారు. అయితే ఈసారి ఆయన రిటైర్మెంట్ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం 74 ఏళ్ల వయస్సులోనూ రజినీకాంత్ తన ఎనర్జీ, స్టైల్‌తో యువ హీరోలకే సవాల్ విసురుతున్నారు. ప్రతి ఏడాది కనీసం రెండు సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ తర్వాత రజినీ ముందుగా సుందర్ సీ చిత్రాన్ని పూర్తి చేసి, ఆ తర్వాత కమల్ హాసన్‌తో మల్టీస్టారర్‌ను ప్రారంభించనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత తలైవా రిటైర్ అవుతారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇది నిజమేనా లేక రూమర్సేనా అన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తేలుతుంది. కానీ తలైవా సినిమాలకు స్వస్తి చెబుతారన్న ఆలోచనతో అభిమానులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

