Crime News: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రక్తం గడ్డ కట్టే ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడి అడ్డంకిగా మారిందన్న కారణంతో ఓ తల్లి స్వంత కూతురినే సరస్సులోకి తోసి చంపేసింది. ఈ నేరం వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు.
ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన 28 ఏళ్ల అంజలి అలియాస్ ప్రియా సింగ్ భర్తతో విడాకులు తీసుకుని, అజ్మీర్‌లోని డేటానగర్ ప్రాంతంలో అఖిలేష్ గుప్తా అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండగా, అఖిలేష్ కూడా అక్కడే ఉద్యోగం చేసేవాడు. అయితే, మొదటి భర్త ద్వారా పుట్టిన మూడేళ్ల కుమార్తె కావ్య సింగ్ ఈ సంబంధానికి అడ్డుగా మారిందని భావించిన అఖిలేష్ పదేపదే గొడవ పెట్టేవాడు. దీంతో బిడ్డను “తొలగించుకోవాలని” అంజలి నిర్ణయించుకుంది.
ఇది కూడా చదవండి: LIC Jeevan Utsav: LIC జీవన్ ఉత్సవ్ పాలసీ, 5 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే.. లైఫ్ టైం బెనిఫిట్స్..
మంగళవారం అర్ధరాత్రి అంజలి తన కూతురిని అనా సాగర్ సరస్సు దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ బెంచ్ మీద కూర్చోబెట్టింది. అనంతరం రైలింగ్ లేని ప్రదేశం నుంచి చిన్నారిని నీళ్లలోకి తోసింది. అమాయక బాలిక అక్కడికక్కడే మునిగి చనిపోయింది.
రాత్రి పహారా కాస్తున్న పోలీసులు తెల్లవారుజామున అంజలి, అఖిలేష్‌లను అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆపి ప్రశ్నించగా, అంజలి మొదట తన కుమార్తె తప్పిపోయిందని అబద్ధం చెప్పింది. అయితే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, చిన్నారి చివరిసారిగా అంజలితోనే ఉన్నట్లు తేలింది. కఠిన విచారణకు గురైన అంజలి చివరకు నేరాన్ని ఒప్పుకుంది.
బుధవారం ఉదయం పోలీసులు అనా సాగర్ సరస్సు నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘాతుకానికి కారణం ప్రియుడు ఒత్తిడి అని అంజలి చెప్పినా, ఇందులో అఖిలేష్ పాత్ర ఏమైనా ఉందా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

