Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడతారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్న సమయంలోనే, ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంఛైజీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించారు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజు శాంసన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన తన లాంటి ఆటగాడికి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ఒక గొప్ప వేదిక ఇచ్చిందని శాంసన్ చెప్పారు. ఈ ఫ్రాంఛైజీ తన క్రికెట్ ప్రయాణంలో ఒక అంతర్భాగమని అన్నారు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తనపై ఉంచిన నమ్మకం గురించి శాంసన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “రాహుల్ ద్రవిడ్, మనోజ్ బదలే వంటి వాళ్ళు నాకు చాలా మద్దతు ఇచ్చారు, నాపై నమ్మకం ఉంచారు” అని ఆయన అన్నారు. ద్రవిడ్ ప్రోత్సాహం తన కెరీర్‌లో ఎంత ముఖ్యమైనదో వివరించారు. రాయల్స్‌తో నా ప్రయాణం ఎప్పుడూ గొప్పగా సాగింది. ఆ ఫ్రాంఛైజీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.
సంజు శాంసన్ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. కొన్ని నివేదికల ప్రకారం, 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత ఆయన రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సంజు పాత్రపై అనిశ్చితి నెలకొనడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2025 సీజన్‌లో ఆయన గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పుడు, రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ పరిణామాలు కూడా శాంసన్ ఆలోచనలకు ఒక కారణం అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఫ్రాంఛైజీపై ఆయనకున్న అభిమానాన్ని, కృతజ్ఞతను చాటిచెబుతున్నప్పటికీ, ఆయన భవిష్యత్తు గురించి వచ్చే తుది నిర్ణయం కోసం ఇంకా ఎదురుచూడాల్సి ఉంది.