Live-In Relationship: ఇద్దరు యువతీ యువకులు మేజర్లు అయినప్పటికీ, చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసు (పురుషుడికి 21 ఏళ్లు) రాకపోయినా వారు తమ ఇష్టానుసారం కలిసి జీవించవచ్చని (సహజీవనం – Live-in Relationship) రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సహజీవనం చేయకుండా ఎవరినైనా నిరోధించడం అనేది వారి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కూతురిని దింపడానికి వెళ్తున్న వ్యక్తిపై పాశవికంగా దాడి
కోటాకు చెందిన ఓ యువజంట దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అనూప్ ధండ్ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
19 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి ఈ ఏడాది అక్టోబరు 27న పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. యువకుడిని చంపేస్తామని బెదిరించడంతో, భద్రత కోరుతూ ఈ జంట హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోవడం లేదని వారు కోర్టుకు తెలిపారు.
ఇది కూడా చదవండి: IndiGo: టికెట్ల ధరలపై పరిమితి.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన తిరస్కరణ
ఈ కేసు విచారణ సందర్భంగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు కీలక వాదనను ఉంచారు. పురుషుడికి చట్ట ప్రకారం వివాహ వయసు 21 సంవత్సరాలు కాబట్టి, 19 ఏళ్ల యువకుడిని సహజీవనం చేయడానికి అనుమతించకూడదని ఆయన వాదించారు.
అయితే, ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం వివాహ వయసు రాలేదనే కారణం చూపి, భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన స్వేచ్ఛా హక్కును హరించలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
‘ఆర్టికల్ 21’ రక్షణ కిందే సహజీవనం
జస్టిస్ అనూప్ ధండ్ తన తీర్పులో అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి భరోసా ఇస్తుంది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనం అనేది నిషేధించబడలేదు. ఇది నేరం కాదు. ఇద్దరు మేజర్లు తమ ఇష్టానుసారం కలిసి జీవించకుండా నిరోధించడం అంటే రాజ్యాంగ హక్కులకు హరించడమే.
రాజ్యాంగం కల్పించిన ఈ స్వేచ్ఛా హక్కును కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
చివరికి, యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని జంట వ్యక్తం చేసిన ఆందోళన దృష్ట్యా, ఆ జంటకు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మేజర్ల సహజీవన హక్కులకు బలాన్ని చేకూర్చింది.

