IPL 2025: ఐపీఎలం 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ ఏమీ లేదు. వరుస ఓటముల ఫలితంగా.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొన్ని మార్పులు చేసి వచ్చే సీజన్‌లో రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత కెప్టెన్ సంజు శాంసన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సంజు ఒప్పందం చేసుకున్నాడని.. అతను వచ్చే సీజన్ నుండి సీఎస్కే జెర్సీలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
సంజు సీఎస్కేలో చేరుతాడా?
నిజానికి ఐపీఎల్లో ట్రేడ్ విండో ప్రస్తుత సీజన్ ముగిసిన 7 రోజుల నుండి తదుపరి సీజన్ వేలానికి 7 రోజుల ముందు వరకు ఓపెన్‌గానే ఉంటుంది. ఈ సమయంలో అన్ని జట్లు తమ ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు. సంజు శాంసన్‌ను CSKకి తీసుకురావడానికి ఓ ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే, వచ్చే సీజన్‌లో అతను CSK జట్టులో భాగమవుతాడని సమాచారం. రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగా లేదని..ఆటగాళ్ల మధ్య విబేధాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. దీని వల్లే సంజు జట్టును వీడి అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సంజు శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతర జట్లకు ఆడిన సంజు.. 2018లో తిరిగి రాజస్థాన్ జట్టులో చేరాడు. ఆ తర్వాత 2021లో ఈ జట్టుకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అతని నాయకత్వంలో ఆ జట్టు 2022లో ఫైనల్కు చేరుకుంది. అందువల్ల సంజును జట్టు నుంచి తొలగించే అవకాశం లేదు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి..10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీనికి తోడు గాయం కారణంగా కెప్టెన్ సంజు శాంసన్ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను ఆడిన కొన్ని మ్యాచ్‌లలో, అతను బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఇది రాజస్థాన్ ఆటపై కూడా ప్రభావం చూపింది. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో ఆర్ఆర్ కప్ కొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.