Rajanikanth: అగ్ర నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక అయిన హిందుస్థాన్ టైమ్స్ మునుపెన్నడూ, ఎవరికీ ఇవ్వనంతగా ఆయనకు విశేష ప్రాధాన్యమిచ్చింది. రజనీకాంత్ ఫొటోను ముఖచిత్రంగా ప్రచురించి ప్రత్యేకతను చాటింది. ఈ పత్రికను స్థాపించిన వందేళ్లలో ఇలా ఒక పేజీ మొత్తం ఒక హీరో ఫొటోను ముద్రించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Rajanikanth: తలైవాగా సినీ అభిమానులు పిలుచుకునే రజనీకాంత్ ఈ పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిందూస్థాన్ టైమ్స్ పత్రిక ఇలా గౌరవించింది. 1975లో అపూర్వ రాగంగళ సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం మొదలైంది. వందలాది సినిమాల్లో నటించిన ఆయన కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దేశంలోనే కాకుండా జపాన్, చైనా, మలేషియా తదితర దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉండటం విశేషం.
Rajanikanth: ప్రత్యకంగా తనదైన శైలిలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఇండియన్ సినీ పరిశ్రమను విశేష ప్రభావితం చేసిన వ్యక్తిగా ఆయనను కీర్తిస్తూ నవంబర్ 19న సంచికలో ప్రత్యేక కథనాలను అందించింది. ఈ సంచికను చూసిన పాఠకులు ఆశ్చర్యపోతూ.. ఇది రజనీకాంత్‌కు ఇచ్చిన అరుదైన గౌరవంగా కితాబునిస్తున్నారు.
Rajanikanth: హిందూస్థాన్ టైమ్స్ కథనంపై రజనీకాంత్ కూడా స్పందించారు. ఆశ్చర్యకరమైన అద్భుతంగా అభివర్ణించారు. తన హృదయం ఆనందంతో నిండిపోయింది.. అని సంతృప్తిని వ్యక్తంచేశారు. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్ అభిమానులు కూడా సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలుతున్నారు. ఒక సినీ కళాకారుడికి దక్కిన గౌరవంగా సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

