SSMB29

SSMB29: మహేష్ బాబు సినిమాపై అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

SSMB29: మహేష్ బాబు అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఒక కీలకమైన అప్‌డేట్‌ను రాజమౌళి ఇచ్చారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసి, అభిమానులకు అద్భుతమైన కానుకను అందించారు. ఈ సినిమా ఫస్ట్ రివీల్ నవంబర్ 2025లో ఉండబోతుందని ప్రకటించారు.

పోస్టర్లో సస్పెన్స్: అభిమానుల్లో ఉత్సాహం
రాజమౌళి విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు ఛాతీ భాగాన్ని మాత్రమే చూపించారు. దానిలో మహేష్ మెడలో త్రిశూలం, నందితో కూడిన ఒక లాకెట్ ధరించి ఉన్నారు. మెడ పైనుంచి రక్తం కారుతున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులలో మరింత ఆసక్తిని పెంచింది. ఏమీ చూపించకుండా కేవలం ఒక ఛాతీ పిక్‌తోనే రాజమౌళి సృష్టించిన సస్పెన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘గ్లోబ్ ట్రాట్టర్’ హ్యాష్‌ట్యాగ్ చూస్తుంటే సినిమా ఒక సాహస యాత్రలా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే కథతో ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు.

రాజమౌళి వివరణ: నవంబర్‌లో భారీ సర్ప్రైజ్
అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ రాజమౌళి ఒక వివరణాత్మక పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు, మహేష్ అభిమానులకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, “మేము కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించాం. సినిమా గురించి తెలుసుకోవాలనే మీ తపన నాకు అర్థం అవుతుంది. కానీ, ఈ సినిమా కథ, దాని పరిధి చాలా పెద్దవి. అందుకే కొన్ని ఫోటోలు లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో దానికి న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను,” అని చెప్పారు.

“ఈ సినిమాను మీ ముందుకు ఎంత అద్భుతంగా తీసుకురావాలనే దానిపై ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అలాగే ఫస్ట్ రివీల్ కూడా అంతే అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి, నవంబర్ 2025 వరకు మీరు ఆగక తప్పదు. ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాస్త ఓపిక పట్టండి,” అని జక్కన్న అన్నారు.

ఈ సినిమాను కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి నటీనటులు కూడా నటిస్తున్నారని ఇప్పటికే సమాచారం. నవంబర్‌లో రాబోయే ఫస్ట్ రివీల్ కోసం ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *