Raja Singh: జమ్ముకాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన ఆయన, మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
“ఇలాంటి హేయమైన చర్యలు మానవత్వానికి తలవంచే ఘటనలుగా నిలుస్తాయి” అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోరని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంది అని పేర్కొంటూ, దేశ వ్యతిరేక శక్తులు ఆ శాంతిని భంగం చేయాలని ప్రయత్నిస్తున్నాయని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. అయితే, పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని అస్థిరం చేయాలనే కుట్రల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. “ఈ దేశంలో ఎక్కడైనా దాక్కున్నా, ఉగ్రవాదులను పట్టుకునే వరకు మోదీ, అమిత్ షా విశ్రమించరు,” అని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.