Raja Singh: రేపటినుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
తాను ఇకపై స్వతంత్ర సభ్యుడిగానే అసెంబ్లీకి హాజరవుతానని రాజాసింగ్ స్పష్టం చేశారు. “నన్ను ఎవరూ కట్టడి చేయలేరు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడతాను” అని స్పష్టంగా ప్రకటించారు.
బీజేపీపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని, కొందరు నేతల వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. “ఇప్పుడేం నాకు బాస్‌లు లేరు. నన్ను అదుపు చేయడం ఎవరి వల్లా కాదు” అంటూ వ్యాఖ్యానించారు.
తాను మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, కేవలం జాతీయ నాయకత్వం పిలిస్తేనే తిరిగి చేరికపై ఆలోచిస్తానని రాజాసింగ్ తేల్చిచెప్పారు.
అసెంబ్లీ సమావేశాల ముందే చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.