Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్! మళ్లీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు వస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తాజా వాతావరణ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో వర్షాలు ఎక్కడెక్కడంటే?
ఈశాన్య రుతుపవనాల కారణంగా శనివారం రోజున తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ఏంటంటే: వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల. ఈ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవొచ్చు.
అలాగే ఆదివారం కూడా చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ రోజు వర్షాలు పడే జిల్లాలు ఇవే: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల.
ఈరోజు, రేపు (శని, ఆదివారాల్లో) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చు. ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏంటి?
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఈరోజు (శనివారం) నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాబట్టి, వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.