BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లేఆఫ్‌లు, ఫైనల్ వేదిక ఖరారైంది. మూడు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ లేదా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. అటు బీసీసీఐ సైతం IPL 2025 నాకౌట్ దశకు పూర్తిగా సిద్ధమైంది. ఈ సీజన్‌లో వర్షం కారణంగా అనేక పెద్ద మ్యాచ్‌లు ప్రభావితమయ్యాయి. ఇది ప్లే-ఆఫ్ సమీకరణాన్ని కూడా ప్రభావితం చేసింది. కానీ ఇప్పుడు వర్షం విషయంలో BCCI కొత్త రూల్‌ని తీసుకొచ్చింది.
నిజానికి ప్లే-ఆఫ్ మ్యాచ్‌ల సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే, దానికి అదనపు సమయం కేటాయిస్తారు. గత మ్యాచ్‌లలో వర్షం ఆటంకం కలిగిస్తే ఒక గంట అదనపు సమయం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దానిని 120 నిమిషాలకు అంటే 2 గంటలకు పెంచారు. కానీ మ్యాచ్ నిర్ణీత సమయంలో ప్రారంభం కాకపోతే అంపైర్, మ్యాచ్ రిఫరీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. బీసీసీఐ అదనపు సమయాన్ని ప్రకటించడమే కాకుండా వేదికను కూడా మార్చింది. నిజానికి వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23న బెంగళూరులో జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌ను BCCI లక్నోకు మార్చింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు చేయబడింది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం రెండవ క్వాలిఫయర్, ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్ 2 జూన్ 1న జరుగుతుంది. ఈ మ్యాచ్ క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుకు, ఎలిమినేటర్ గెలిచిన జట్టుకు మధ్య జరుగుతుంది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఐపీఎల్ 18వ సీజన్ విజేతను నిర్ణయిస్తుంది. ఈ మ్యాచ్‌లను హైదరాబాద్, కోల్‌కతాలో నిర్వహించాల్సి ఉండే. అయితే వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ మార్పు చేసింది. ‘‘వాతావరణం మరియు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లేఆఫ్స్ కోసం కొత్త వేదికలను నిర్ణయించింద’’ అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.