Rain Alert: తెలంగాణలో నేడు (ఆగస్టు 6, 2025) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: Nikki Haley: ట్రంప్ సుంకాల పెంపు.. నిక్కీ హేలీ సంచలన కామెంట్స్
నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, అమీర్ పేట్, మలక్ పేట వంటి ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి.ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. చాలా ప్రాంతాల్లో భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఖైరతాబాద్ జోన్‌లోని మహదేవపురం, బంజారాహిల్స్‌లోని సీఎంటీసీ ప్రాంగణం, యూసుఫ్‌గూడలో 100 మి.మీ.పైగా వర్షపాతం రికార్డయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, మాదాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, కొండాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.