rahul gandhi: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి పర్యటన నిర్వహించారు. ఈ దాడిలో గాయపడిన బాధితులను ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి వైద్యులతో కూడా మాట్లాడారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కూడా రాహుల్ భేటీ అయ్యారు. ఉగ్రదాడి అనంతర పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలపై చర్చించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉంటుందని ఇద్దరూ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, “ఈ దాడికి దేశమంతా వ్యతిరేకంగా గళం ఎత్తింది. మనం మతభేదాలు మరిచి ఒక్కటిగా ఉండాలి. ఉగ్రవాదుల లక్ష్యం దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే. అలాంటి కుట్రలకు మనం పడకూడదు,” అన్నారు.
అలాగే, కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేయడం తప్పు అని స్పష్టం చేశారు. “ఒక ప్రాంతంలోని కొన్ని సంఘటనల వల్ల అక్కడి ప్రజలందరినీ నిందించటం అన్యాయం. దేశ ప్రజలందరూ ఒకే కుటుంబం. శాంతి కోసం మనం ఐక్యంగా ముందుకు సాగాలి,” అని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ పర్యటనతో బాధితులకు ధైర్యం లభించినట్టు తెలుస్తోంది. భద్రతా వ్యవస్థ పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వం వద్ద కోరారు.