Rahul Gandhi: చండీగఢ్‌లో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 7వ తేదీన పూరన్ కుమార్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మంగళవారంనాడు చండీగఢ్‌లోని పూరన్ కుమార్ ఇంటికి వెళ్లారు.
ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించారు. వారిని ఓదార్చి, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు:
“ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రావాలి. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో స్పష్టంగా రాశారు. ఈ కేసుపై తక్షణమే పారదర్శకమైన విచారణ జరపాలి,” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఆరేళ్లుగా పూరన్ కుమార్‌పై వివక్ష చూపించారని ఆయన ఆరోపించారు. “ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రపంచానికి తెలియాలి. ప్రజలకు నిజం చెప్పాలి,” అని రాహుల్ అన్నారు.
ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం తీరుపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “డీజీపీని రక్షించేందుకు బీజేపీ చేస్తున్న డ్రామాలు ఆపాలి. విచారణ పారదర్శకంగా జరిగి, బాధితులకు న్యాయం జరగాలి. ఏ ఒక్కరినీ కాపాడే ప్రయత్నం చేయకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు.