Delhi: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు నిరసనగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అయితే, ముందస్తు అనుమతి లేదనే కారణంతో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ నిరసన ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ సహా లోక్‌సభ, రాజ్యసభకు చెందిన దాదాపు 300 మంది ఎంపీలు పాల్గొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా బీహార్‌లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
Also Read: Jupally Krishna Rao: హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ దెబ్బకు.. మెట్రోలో ప్రయాణించిన మంత్రి
ర్యాలీకి అనుమతి లేదని చెప్పి ఢిల్లీ పోలీసులు సంసద్ మార్గ్‌లో భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎంపీలను అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన విపక్ష నేతలు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. కొంతమంది ఎంపీలు బారికేడ్లు దాటేందుకు కూడా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకుని, వారిని బస్సుల్లో వేరే ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటనల నేపథ్యంలో, బీహార్ ఓటర్ల జాబితా సవరణ సహా ఇతర అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈసీకి లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, 30 మంది విపక్ష ఎంపీలతో సోమవారం మధ్యాహ్నం భేటీకి అనుమతి ఇచ్చింది. ఈ సమావేశంలో ఓట్ల జాబితాలో జరిగిన అవకతవకలపై విపక్ష నేతలు తమ ఆందోళనలను ఈసీ ముందు ఉంచనున్నారు.