Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా తనకు మాట్లాడే హక్కు ఉన్నా… మోదీ ప్రభుత్వం ఆ హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. “ప్రభుత్వ మంత్రులకు మాట్లాడేందుకు సమయం ఇస్తున్నారు. కానీ, నాకు మాత్రం మా అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశమే ఇవ్వడం లేదు. ఇది విపక్షాల హక్కులపై కేంద్రం మోపుతున్న దాడి” అని రాహుల్ విమర్శించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో, లోక్‌సభలో రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించేందుకు ప్రయత్నించారు. అయితే, చర్చ ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ సభను విడిచిపెట్టిన విషయాన్ని రాహుల్ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం వారికి అనుకూలంగా కొత్త నిబంధనలు, విధానాలు రూపొందించుకుంటోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా విపక్ష పార్టీల ఎంపీలు ‘ఆపరేషన్ సిందూర్’ సహా వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ లోక్‌సభలో ఆందోళనకు దిగారు. వారి ఆందోళనలను నిలిపివేయాలని లోక్‌సభ స్పీకర్ పలుమార్లు కోరినా, వారు ఆ నిరసనను కొనసాగించడంతో సభను కాసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.