Rahul Gandhi:బీహార్ ఎన్నికల వేడిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం మోదీ ఏ హద్దుకైనా వెళ్తారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు
ముజఫర్‌పూర్ జిల్లాలోని సక్రా నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ —“మోదీకి ప్రజల కష్టాలకన్నా ఓట్లే ముఖ్యం. మీరు ఓటు వేస్తామని చెప్పండి, ఆయన వేదికపై డ్యాన్స్ చేయమన్నా చేస్తారు. ఓట్లు కోసం ఏదైనా చేస్తారు,” అని ఎద్దేవా చేశారు.
రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మతపరమైన మనోభావాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. “ఛఠ్ పూజ సందర్భంగా ప్రజలు యమునా నదిలో స్నానాలు చేస్తుంటే, మోదీ మాత్రం తన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారు. ఇది బీహార్ ప్రజల విశ్వాసాలను అవమానించడమే” అని ఆయన మండిపడ్డారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మోదీ పేదల కోసం కాకుండా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఆయన రైతుల గురించి మర్చిపోతారు. చిన్న పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయి. మన కల ‘మేడ్ ఇన్ చైనా’ కాదు, ‘మేడ్ ఇన్ బీహార్’ చూడటం” అని వ్యాఖ్యానించారు.
ఈ సభలో తేజస్వీ యాదవ్, ముఖేశ్ సహానీలతో కలిసి రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “బీహార్‌లోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాన్ని కూల్చే సమయం వచ్చింది. పేదలు, వెనుకబడిన వర్గాల కోసం కొత్త ఆరంభం కావాలి,” అని పిలుపునిచ్చారు.
విద్యా వ్యవస్థ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. “బీహార్‌లో పేపర్ లీక్‌లతో యువత భవిష్యత్తు నాశనం అయింది. ఢిల్లీలో ఫ్లైఓవర్ కింద బీహారీలు జీవన పోరాటం చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన (Caste Census) చేపట్టి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. “బీజేపీ, మోదీ సామాజిక న్యాయానికి వ్యతిరేకం. నితీశ్ కుమార్ బీజేపీ చేతిలో బొమ్మగా మారిపోయారు. ఈ ప్రభుత్వాన్ని మార్చి ప్రతి కులం, మతానికి ప్రాతినిధ్యం ఇచ్చే ప్రభుత్వం తీసుకురావాలి,” అని రాహుల్ పిలుపునిచ్చారు.
అంతేకాక, ఐదేళ్లలో బీహార్‌లో దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

