Rahul Gandhi: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. పెద్ద ఎత్తున భక్తులు ఒకేసారి తరలివచ్చడంతో ఏర్పడ్డ గందరగోళంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఈ విషాద ఘటనపై పలువురు జాతీయ నాయకులు స్పందించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన భారంగా తాకింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను,” అని ఆయన ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం సమర్థవంతమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఘటన తర్వాత ఆలయ పరిసరాల్లో రక్షణ చర్యలు ముమ్మరం అయ్యాయి. భక్తుల రద్దీ కారణంగా పరిస్థితి నియంత్రించడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

