Rahul Gandhi: దేశంలో ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, బోగస్ ఓట్లను జాబితాలో చేర్చడమే కాకుండా ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆయన తెలిపారు.
ఓటు హక్కు దోపిడీపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా 5.5 కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

