Nizambad: వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిన కళాశాలల్లోనే దారుణాలు జరుగుతున్నాయి. నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు రాగింగ్‌కు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ రాగింగ్‌ను అడ్డుకున్నందుకు ఒక జూనియర్ విద్యార్థిపై 10 మంది సీనియర్లు దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్‌పై నాలుగేళ్లుగా రాగింగ్
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే జూనియర్ విద్యార్థి రాహుల్ రెడ్డిపై సీనియర్లు రాగింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్న సీనియర్లు అదే కాలేజీలో ఉండి, రాహుల్ రెడ్డిని నాలుగో సంవత్సరం కూడా వేధిస్తున్నారు. సాయిరాం పవన్ అనే సీనియర్ విద్యార్థి రాహుల్ రెడ్డి పోస్టింగ్‌కు వెళ్లినా కూడా అటెండెన్స్ వేయకుండా ఇబ్బంది పెట్టాడు.
రాగింగ్‌పై ప్రశ్నిస్తే దాడి
ఈ విషయంపై మాట్లాడటానికి రాహుల్ రెడ్డి వెళ్లగా, 10 మంది సీనియర్లు అతన్ని ఒక గదిలోకి పిలిచి దారుణంగా కొట్టారు. రాహుల్ రెడ్డికి కామెర్లు (జాండిస్) ఉన్నాయని వైద్య నివేదికలు చూపించినా కూడా వదలకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన రాహుల్ రెడ్డి, వెంటనే జూనియర్ మెడికోలను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించాడు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
సీనియర్ విద్యార్థుల దాడిని ఖండిస్తూ, జూనియర్ మెడికోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.