Raghurama Raju: రఘురామకృష్ణంరాజు, జగన్‌ల మధ్య వైరం అంటేనే ఏపీ రాజకీయాల్లో ఒక హైఓల్టేజ్ పొలిటికల్ కథా చిత్రమ్. జగన్ వైఖరి నుంచి మొదలైన ఈ గొడవ, రఘురామ రచ్చబండతో రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. జగన్‌ను డైరెక్ట్‌గా టార్గెట్ చేసిన రఘురామ, వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకే వ్యతిరేకంగా వార్ ప్రకటించి చరిత్ర సృష్టించారు. ఈ వైరం వెనుక రఘురామ స్వాభిమానం, జగన్ ఈగో మధ్య జరిగిన ఘర్షణే కీలకం. అయితే ఈ వైరానికి తొలి అడుగు ఎక్కడ పడిందో తాజాగా రఘురామ రివీల్ చేసిన అంశాలు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్. ఇంతకీ రఘురామ చెప్పిన ఆ ఆసక్తికర అంశాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అండ్ మాజీ వైసీపీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య వైరం ఒక సంచలనాత్మక ఎపిసోడ్. వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణంరాజు, ఇంకా చెప్పాలంటే జగన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణంరాజు అనేలా వైసీపీ హయాంలో రాష్ట్రంలో వార్ నడిచేది. ఏపీలో కాలు పెట్టకుండానే ఢిల్లీ నుండి వైసీపీని గడగడలాడించేవారు రఘురామ. రఘురామ రచ్చబండ గుర్తుకొస్తే ఇప్పటికీ వైసీపీకి గుండె దడే. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైసీపీ ఎంపీగా ఉంటూనే, ఆ పార్టీకి ఓ ప్రధాన ప్రతిపక్షంలా మారారు రఘురామకృష్ణం రాజు. జగన్‌ని డైరెక్ట్‌గా ట్రోల్ చేయడంలో కూడా రఘురామ అస్సలు తగ్గేవారు కాదు. వైసీపీలో ఎంపీగా గెలిచి ఆ పార్టీనే టార్గెట్‌గా చేసుకుని జగన్‌కి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చిన రఘురామ… అసలు జగన్‌తో అంతటి వైరం ఎందుకు పెట్టుకున్నట్లు?
అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది అన్న అంశం ఏపీ రాజకీయవర్గాల్లో వెరీ వెరీ ఇంట్రస్టింగ్ టాపిక్. రఘురామ ఇప్పటికే అనేక సార్లు జగన్‌తో వైరం ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పుకొచ్చారు. జగన్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిన విధానం, జగన్ ఈగో, తనకి ఏమాత్రం గౌరవం ఇవ్వకపోగా, తిరిగి తానే జగన్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలన్నట్లు చూసే వారని రఘురామ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక దానికి కొనసాగింపుగానే తాజాగా మరిన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా జగన్‌తో మనస్పర్థలు రావడానికి తొలి కారణం ఇదే.. అంటూ ఆయన రివీల్ చేసిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
రఘురామ చెప్పినదాని ప్రకారం, జగన్‌తో మనస్పర్థలకు మూలం తెలుగుదేశం నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ నేతల వైఖరి. కోడెలను వైసీపీ నేతలు చులకనగా మాట్లాడటం, ఆయనకు తగిన గౌరవం ఇవ్వకపోవడం రఘురామకు నచ్చలేదు. ఈ విషయంలో తాను వైసీపీ వైఖరిని విభేదించడంతో జగన్‌తో మొదటి ఘర్షణ జరిగింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో జరిగిన ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్‌ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Telangana News: ఆ 28 ఆసుపత్రుల లైసెన్సులు రద్దు.. ఎందుకో తెలుసా?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్ల వైసీపీ నేతలు చులకనగా మాట్లాడేవారని… అలా మాట్లాడటాన్ని తాను విభేదించడం వల్లే జగన్‌తో తనకు తొలుత మనస్పర్థలు వచ్చాయని, ఆ తర్వాత ఆ విభేదాలు మరింత ముదిరాయని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని… తాను రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని చెప్పారు రఘురామ.
ఇక రఘురామ రాజకీయ ప్రస్థానం కూడా చాలా ఆసక్తికరమే. 2019లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ, 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉండి నియోజకవర్గంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఉండి తన సొంత నియోజకవర్గం కాకపోయినా, అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత శివరామరాజు తిరుబాటు చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా, ధీటైన వ్యూహాలతో వన్ మ్యాన్ షోలా ఎలక్షనీరింగ్ చేసి ఎవ్వరూ ఊహించని విధంగా నియర్లీ 60 వేల మెజార్టీతో గెలిచారు రఘురామకృష్ణం రాజు. ఉండిలో రఘరామ గెలుపు రాజకీయాల్లో ఓ క్లాసిక్ కేస్ స్టడీగా చెబుతారు పొలిటికల్ పండితులు.
ఇక ఉండి అభివృద్ధిలోనూ రఘురామ స్టేట్ వైడ్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నియోజకవర్గంలో అన్ని పనుల్ని చకచకా పూర్తి చేసేస్తున్నారు. పైగా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా, అభివృద్ధి పనులకు నిధులిప్పించండి అధ్యక్షా అని అడుగుతున్న ఎమ్మెల్యేలకు.. ప్రభుత్వ ఖజానా పరిస్థితిని గుర్తు చేస్తూ… ఉండిలో తన పద్ధతిని ఫాలో అయిపోండి అంటూ సలహాలిస్తుండటం కొసమెరుపు.