Raghunandan Rao: తెలంగాణలో అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘అభయ హస్తం’ మేనిఫెస్టో ప్రజలను మోసం చేసే విధంగా ఉందని, కనీసం అందులోని మొదటి పేజీ హామీ కూడా అమలుకు నోచుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.
లక్ష కోట్ల అవినీతి ఏమైంది? శ్వేత పత్రం విడుదల చేయండి!
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీలను రఘునందన్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, గత ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి నుంచి రూ. లక్ష కోట్లు కక్కిస్తాం, ఆ మొత్తాన్ని ప్రజలకు పంచుతాం” అని హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినా కేసీఆర్ కుటుంబం నుంచి కక్కించిన మొత్తం డబ్బు ఎంతో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, జీవో 111 వెనుక ఉన్న లక్షల కోట్ల కుంభకోణం ఏమైందో, దాని వివరాలు కూడా ముఖ్యమంత్రి ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతేకాకుండా, గతంలో బీఆర్ఎస్ 30 శాతం కమిషన్ సర్కార్ అని విమర్శించిన కాంగ్రెస్, మరి ప్రస్తుతం ఎంత కమిషన్ నడుస్తుందో కూడా చెప్పాలని నిలదీశారు.
ప్రజా దర్బార్ నిర్వహణకే చేతకాలేదు!
మేనిఫెస్టోలోని ముఖ్య అంశమైన ‘ప్రజా దర్బార్’ను ప్రతిరోజూ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ప్రజల సమస్యలు వినేందుకు కనీసం ప్రజా దర్బార్‌ను కూడా సరిగ్గా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాలేదని రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘అభయ హస్తం’ హామీ ప్రజలకు మేలు చేసేది కాదని, అది ‘భస్మాసుర హస్తం’ అని జూబ్లీహిల్స్ ప్రజలు గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కబ్రస్థాన్‌కు ఆగమేఘాల మీద ల్యాండ్.. అభివృద్ధి ఏది?
రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో కూడా స్మశాన వాటికల కోసం భూమి ఇవ్వలేని ప్రభుత్వం, షేక్ పేట్‌లో కబ్రస్థాన్ కోసం ఆగమేఘాల మీద భూమి కేటాయించిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఈ విధంగా చేస్తోన్న కాంగ్రెస్ పార్టీని కబ్రస్థాన్‌లో పెట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన రూ. 4 వేల కోట్లు ఏమయ్యాయని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ పరిస్థితులన్నీ గమనించి, ఎంఐఎం పార్టీ ఎవరి కోసం ప్రచారం చేస్తుందో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు.

