Raghunandan rao: మన్మోహన్ సింగ్‌ను కేవలం బొమ్మ ప్రధానిగా ఉంచారు..

Raghunandan rao: బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ హయాంలో, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కేవలం బొమ్మ ప్రధానిగా ఉంచి, సోనియా గాంధీనే అసలైన పాలన నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఇది రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, స్వాతంత్ర్యం రాకముందు నుంచే నెహ్రూ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారని, ఆయన కుటుంబం నాటి నుంచి రాజ్యాంగాన్ని అవమానించిందని ఆరోపించారు. నెహ్రూ తర్వాత, రెండో తరంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగ హక్కులను అణచివేశారని చెప్పారు. అలాగే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ షాబానో కేసును మార్చడానికై పార్లమెంట్‌లో చట్టం చేయించారని విమర్శించారు.

యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ, నిజమైన అధికారాన్ని సోనియా గాంధీ వినియోగించుకుందని, ఇలా ఆ కుటుంబం పలుమార్లు రాజ్యాంగాన్ని అవమానించిందని రఘునందన్ రావు ఆరోపించారు.

ఇక రాహుల్ గాంధీపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చేసిన చట్టాన్ని రాహుల్ గాంధీ ఇప్పుడు చించివేసి మరోసారి రాజ్యాంగాన్ని అవమానపరిచారని అన్నారు. ఐదున్నర దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మాత్రమే రాజ్యాంగం, ప్రజలు గుర్తుకు వస్తున్నాయని ఆరోపించిన రఘునందన్ రావు, అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ కపట నాటకాల గురించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీ ప్రచారం చేపట్టనుందని తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *