Pvn madhav: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. షర్మిలకు నీతులు చెప్పే అర్హత లేదని వ్యాఖ్యానిస్తూ ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మహాత్మా గాంధీ పేరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకుందని మాధవ్ ఆరోపించారు. అలాంటి పార్టీ నేతలు ఇప్పుడు నీతి బోధనలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఆయన ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకంలో నకిలీ ఖాతాలు సృష్టించి గాంధీజీ ఆశయాలను ఆనాడే కాంగ్రెస్ తుంగలో తొక్కిందని విమర్శించారు.
దేశంలోని సంక్షేమ పథకాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల పేర్లు పెట్టకుండా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతోనే ఒకే కుటుంబాన్ని ప్రోత్సహించారని మాధవ్ అన్నారు. ఇది దేశాన్ని ఒక కుటుంబానికి అంకితం చేసినట్లేనని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకువచ్చారని మాధవ్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచి పేదలకు అదనపు ఉపాధి కల్పిస్తున్నారని, కూలీలకు జీతాలు సకాలంలో అందేలా చట్టబద్ధమైన విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
రైతులు, కూలీల ప్రయోజనాల కోసం ‘హార్వెస్ట్ పాజ్’ వంటి సంస్కరణలు తీసుకువచ్చి అవినీతికి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకెళ్తోందని చెప్పారు. ఇలాంటి పథకాలపై అనవసర విమర్శలు మానుకుని కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
