Putin

Putin: ఉక్రెయిన్‌ చర్చలు విఫలమైతే.. పుతిన్‌ వార్నింగ్!

Putin:  రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొంతకాలంగా సాగుతున్న భీకర పోరుకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమైన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పాలకులు శాంతియుత మార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపకపోతే, ఇక సైనిక బలప్రయోగం ద్వారానే తమ లక్ష్యాలను సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల రష్యా మిలిటరీ కమాండ్ పోస్టును సందర్శించిన పుతిన్, అక్కడి సైనిక దళాధికారులతో భేటీ అనంతరం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ అధికారులకు సమస్యను త్వరగా పరిష్కరించుకోవడం ఇష్టం లేదని, వారు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read: Team India: టీమిండియా టెస్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? గంభీర్‌పై వేటు తప్పదా?

శాంతి చర్చల గురించి ఒకవైపు ప్రతిపాదనలు వస్తుండగానే, మరోవైపు రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 500 డ్రోన్లు, 40 క్షిపణులతో రష్యా జరిపిన భారీ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఒకరు మరణించగా, 27 మందికి పైగా గాయపడ్డారు. ఈ విధ్వంసంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యాకు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదనడానికి ఈ దాడులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తమ దేశం దౌత్యపరమైన పరిష్కారానికే మొగ్గు చూపుతోందని, కానీ మాస్కో మాత్రం యుద్ధాన్ని మరింత పొడిగించాలని చూస్తోందని జెలెన్‌స్కీ మండిపడ్డారు.

ఈ ఉద్రిక్తతల నడుమ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్‌స్కీ జరపబోయే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం ఫ్లోరిడాలో జరగనున్న ఈ సమావేశంలో యుద్ధ ముగింపు, భద్రతా హామీలు, వివాదాస్పద ప్రాంతాలపై కీలక చర్చలు జరగనున్నాయి. అయితే ఈ భేటీకి ముందే కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అదనంగా 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కెనడా ప్రకటించింది. శాంతి స్థాపనలో రష్యా సహకారం తప్పనిసరని అభిప్రాయపడిన కార్నీ, కీవ్‌పై మాస్కో చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *