Pushpa 2 Review: మాస్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. అందుకే మన దర్శకులు, హీరోలు మాస్ సినిమాల వైపే చూస్తుంటారు. గతంలో మాస్ సినిమాలంటే ఫార్ములా ఒకటి ఉండేది. మంచి చేసేవాడు హీరో.. చెడు చేసేవాడు విలన్.. మధ్యలో కాస్త అమ్మ.. చెల్లి.. సెంటిమెంట్.. సమాజంలోని ప్రజల కష్టాలు కొన్ని కలిపిన వంటకమే మాస్ సినిమాగా రాజ్యమేలేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. మంచి చేస్తున్నాడా? చెడు చేస్తున్నాడా? అనే సంబంధమే లేదు. హీరోనే. విలన్ ఆ హీరోకి అడ్డు తగులుతుంటాడు. అంతే. సెంటిమెంట్ తో పాటు రాజకీయ డైలాగులు నాలుగు పోగేసి.. హీరో కనిపించినప్పుడల్లా ఎలివేషన్ సీన్స్ క్రియేట్ చేయడం.. హీరో బరిలోకి దిగితే వందల మంది కకావికలం అయిపోవడం అంతే. ఏమిటీ ఈ లాగ్.. అసలు విషయానికి రావా? అని అంటున్నారా? ఇదిగో ఇలా ఇప్పుడు మాస్ సినిమాలకి కూడా సాగదీత తప్పనిసరి. సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం.
పుష్ప సినిమాతో ఒక సెన్సేషనల్ మాసిజం క్రియేట్ చేసిన అల్లు అర్జున్-సుకుమార్ జోడీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ అంటూ దూసుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చినా.. అదిరిపోయే మాస్ సౌండ్ ని తీసుకువచ్చారు. విడుదలకు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ అయిన పుష్ప 2.. టికెట్ ధరల విషయంలో నిరసనల్లోనూ పబ్లిసిటీ పెంచుకున్న సినిమా.. మొదటి ఆటలు పడిపోయాయి. ఇంత డబ్బు పెట్టి మొదటి ఆట చూసిన ప్రేక్షకులకు ఆ రేంజ్ కిక్ అల్లు అర్జున్ ఇచ్చారా? సుకుమార్ తన ఫార్ములా మ్యాజిక్ మళ్ళీ చూపించారా? పుష్ప కి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఆ బెంచ్ మార్క్ అందుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2కు మెగా క్యాంప్ నుంచి ఫస్ట్ విషెస్.. ఎవరు చెప్పారంటే..
కథ ఇదే..
పుష్పరాజ్ కథలో రెండో భాగం ఇది. సవతి తల్లి కొడుకు అని ఇంటి నుంచి అన్న గెంటేస్తే.. అనాధగా పెరిగి.. కూలీగా మొదలు పెట్టి.. స్మగ్లర్ గా ఎదిగి.. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కి కింగ్ గా పుష్పరాజ్ గా మారిన కథ పుష్ప లో చూసాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. జాతీయస్థాయి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. స్మగ్లింగ్ సిండికేట్ కింగ్ గా తన కిరీటాన్ని పుష్ప రాజ్ నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? కుటుంబం నుంచి వెలివేసిన తన సవతి అన్న తో పుష్పరాజ్ బంధం నిలబడిందా? తనని పట్టుకుని తీరాలని శపథం చేసిన పోలీస్ అధికారి నుంచి పుష్ప ఎలా బయటపడ్డాడు? సిండికేట్ రాజకీయాలను పుష్పరాజ్ ఎలా తన గుప్పిట్లో పెట్టుకోగలిగాడు అనేదే పుష్ప 2 ది రూల్ కథ.
ఎలా ఉందంటే..
పుష్ప సినిమాకి సీక్వెల్ అనగానే అర్ధం అయిపోతుంది ఇది కూడా పక్కా మాస్ సినిమా అని. మూడున్నర గంటల పాటు థియేటర్లో ప్రేక్షకుడిని కూర్చోపెట్టడం అంటే మాటలు కాదు. కానీ, పుష్ప మాత్రం ఆ పని చేశాడు. సినిమా మొదట్లో వచ్చే సన్నివేశాలు (ఆఫ్ కోర్స్ అవి సినిమాకి ఏమాత్రం సంబంధం లేనివిగా కనిపించాయి) పక్కన పెడితే.. టైటిల్స్ పడిన దగ్గర నుంచి ఎండ్ టైటిల్స్ వరకూ సినిమా అలా.. అలా నడిచిపోతుంది. ఏమి జరుగుతుంది.. ఎలా జరుగుతుంది అని ఆలోచించే లోపు ఇంటర్వెల్ వచ్చేస్తుంది. తరువాత మళ్ళీ సీట్లలో సర్దుకునేలోపు సినిమాలో యాక్షన్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ లాంటి హీరోతో మాస్ ఎలివేషన్స్ ఎలా చేయాలో సుకుమార్ కి తెలిసినట్టు ఎవరికీ తెలీదనిపించేలా ఉంటుంది సినిమా. అల్లు అర్జున్ కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ కిక్కిచ్చే రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి. సినిమాలో సెంటిమెంట్ ని బలంగా యాక్షన్ తో లింక్ చేశారు సుకుమార్. దీంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Pushpa 2-RGV: పుష్ప 2 = రెండిడ్లీ.. రామ్ గోపాల్ వర్మ లెక్క తగ్గేదేలే!
సినిమాకి బలం అల్లు అర్జున్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ అవసరం లేదు. పుష్పరాజ్ క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా భార్య చెప్పిన మాట జవదాటని వ్యక్తిగా పుష్పరాజ్ క్యారెక్టర్ తీర్చి దిద్దడం అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో పుష్పను పట్టుకోవాలని చూసే ఎస్పీ షెకావత్ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్ అభిమానులతో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. పుష్ప మొదటి పార్ట్ లానే ఇందులోనూ ఎర్రచందనం ఎల్లలు దాటించడం.. దానిని ఎస్పీ అడ్డుకోవాలని ప్రయత్నించడం.. దీనికి తోడు ఇద్దరి మధ్య ఉన్న పాత వైరం. అన్నీ బాగానే కంటిన్యూ చేశారు. ఫస్టాఫ్ చాలావరకూ లాగ్ లా ఉంటుంది. దాదాపుగా ప్రీ ఇంటర్వెల్ వరకూ సినిమా అలా సాగుతూ ఉన్న ఫీలింగ్ వస్తుంది.
కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ దానికి సుకుమార్ మార్క్ ట్రీట్మెంట్ అదిరిపోయాయని చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక ఛేజింగ్.. రెండు యాక్షన్ సీన్స్ తో సినిమాని లాగేశారు. అదీ జెట్ స్పీడ్ లో.. ఒకదాని వెనుక ఒకటిగా సీన్స్.. సాంగ్స్ వచ్చేస్తాయి.. అదే స్పీడ్ తో సినిమా అయిపోతుంది. చివరిలో మూడో పార్ట్ కి లీడ్ ఇచ్చారు. అది కూడా ఆసక్తికరంగా ఉంది.సోషల్ మీడియాలో పార్ట్ 3 పై చర్చలు జరిగేలా ఆ లీడ్ ఉందని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే..
నూరు శాతం అల్లు అర్జున్ ఎఫర్ట్స్ మెచ్చుకుని తీరాల్సిందే. అభిమానులకే కాదు.. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అల్లు అర్జున్ నటన నచ్చి తీరుతుంది. పుష్పరాజ్ గా తనదైన మార్క్ మళ్ళీ సెల్యులాయిడ్ మీద చూపించారు. ముఖ్యంగా అమ్మవారి గెటప్ సినిమాకి హైలెట్. ఈ గెటప్ లో రెండు కోణాల్లో అల్లు అర్జున్ కనిపిస్తారు. సెంటిమెంట్ తో ఒకసారి.. రౌద్రంతో ఒకసారి.. రెండుసార్లూ రెండు కోణాల్లోనూ అల్లుఅర్జున్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
మొదట్నుంచీ సుకుమార్, అల్లు అర్జున్ చెబుతున్న మాటలు వెండితెరమీద స్పష్టంగా కనిపించాయి. ఇక రష్మిక.. సెంటిమెంట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ తో పటు ఒక్క సీన్ లో చిన్న యాక్షన్ బిట్ అన్నిటినీ చక్కగా చేసింది. రావు రమేష్, ఫహద్ ఫాజిల్ తమ మార్క్ చూపించారు. పుష్ప 1 కంటే ఫాజిల్ కి ఇందులో ఎక్కువ స్కోప్ ఉంది. ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ కూడా చేశాడు. ఇక అనసూయ, సునీల్ ఇలా అందరూ తమకు అవకాశం ఉన్న మేర ఫర్వాలేదనే స్థాయిలో చేశారు.
టెక్నీకల్ గా ఎలా ఉందంటే..
సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి.. తెరమీద కనిపించింది. ఫొటోగ్రఫీ క్లీన్ గా ఉంది. వివాదాల మధ్యలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారో కచ్చితంగా తెలియలేదు. కానీ, టైటిల్స్ ప్రకారం మ్యూజిక్ దేవీశ్రీప్రసాద్ అనే కనిపించింది కాబట్టి ఆయనే ఇచ్చి ఉండవచ్చు. మంచి బీజీఎమ్ ఇచ్చారు దేవీ. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా జాతర పాట వెంటనే వచ్చే శ్రీవల్లి పాట రెండూ వరుసగా వచ్చినా ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు. చంద్రబోస్ సాహిత్యం బావుంది. సినిమాలో చెప్పుకోవలసిన టెక్నీకల్ యాస్పెక్ట్ యాక్షన్.. కృత్ ట్రీవోరాశ్రీకుల్ ఫైట్స్ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు.
సినిమాలో డైలాగ్స్ కూడా బావున్నాయి. అక్కడక్కడా అల్లు అర్జున్ కొన్ని విసుర్లు ప్రస్తుతం అభిమానుల మధ్య జరుగుతున్న రచ్చకి అద్దం పడుతున్నట్టు అనిపించినా.. మొత్తమ్మీద సినిమాకు తగ్గ డైలాగులు పడ్డాయి. ఎడిటింగ్ విషయంలో అంతకంటే చేయడానికి ఏమీ ఉండదనిపించింది. కొన్ని సీన్లకు కత్తెర పడొచ్చు కానీ.. సుకుమార్, అల్లు అర్జున్ కోణంలో ఆ పని చేసే అవకాశం దొరికి ఉండకపోయి ఉండవచ్చు.
మొత్తంగా చూసుకుంటే యాక్షన్ సినిమాలు.. మాస్ సినిమాలు ఇష్టపడేవారికి సినిమా ఒక రేంజ్ లో నచ్చుతుంది. సాధారణంగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి సినిమా బావుంది అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిగానే థియేటర్ నుంచి బయటకు వస్తాడని చెప్పవచ్చు. ఇక సినిమా అంత బావుందా అంటే మాత్రం కచ్చితంగా అంతా కాదని చెప్పవచ్చు. ముందే చెప్పినట్టు మాస్ సినిమా తీయాలి అనుకున్నపుడు లాజిక్స్.. కథ.. ఇలాంటివి పక్కన పెట్టేయాలి. చూడాలి అనుకున్నవారు కూడా అదే పని చేయాలి.
సాధారణ ఎమ్మెల్యే ఠపీమని ముఖ్యమంత్రి అయిపోవడం.. వేల టన్నుల ఎర్ర చందనం వందల కొలదీ పోలీసుల కళ్ళు గప్పి ఏకంగా దేశం బోర్డర్లు దాటేయడం..ఇలాంటి అసంబద్ధ సన్నివేశాలకు సినిమాలో లోటు లేదు. కానీ, ఎంటర్టైన్మెంట్ కోసం చూసే సినిమా కాబట్టి.. యాక్షన్ థ్రిల్లర్ కుండే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వాటి గురించి చర్చించడం వేస్ట్. అల్లు అర్జున్.. సుకుమార్ ఇద్దరి కష్టం సినిమాలో కనిపిస్తుంది. కమర్షియల్ గా డబ్బు కోసమే సినిమా తీశామని నిర్మాతలు నిర్మొహమాటంగా ముందే చెప్పేశారు కాబట్టి.. లాజిక్ లు ఆలోచించకుండా చూస్తే పుష్ప 2 సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.
చివరిగా ఒక మాట.. ఇంత ధరలు పెట్టి టికెట్ కొని సినిమా చూడడం అవసరమా? అనే రొటీన్ ప్రశ్న మాత్రం అడగొద్దు. ప్లీజ్!
గమనిక : ఇక్కడ ఇచ్చిన సినిమా రివ్యూ రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే . ఈ రివ్యూ సినిమా చూడమని కానీ , చూడొద్దని కానీ ఎవరికీ చెప్పడం లేదు . ఆసక్తిగల రీడర్స్ కోసం సినిమా ఎలా ఉంది అనే సమాచారం ఇవ్వడమే ఈ రివ్యూ ఉద్దేశ్యం .