Purandeshwari: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముద్ర శాశ్వతమైనదని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని చారిత్రక ఘట్టమైన 1984 ఆగస్టు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంపై విక్రమ్ పూల రచించిన ‘సజీవ చరిత్ర’ పుస్తకానికి సంబంధించిన ఆడియో బుక్‌ను ఆమె ఆవిష్కరించారు.
జయప్రద ఫౌండేషన్, టీడీ జనార్దన్ నేతృత్వంలోని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1984 నాటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం కేవలం ఎన్టీఆర్ జీవితంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఒక కీలక మలుపుగా నిలిచిందని అన్నారు. ఆ రోజుల్లో పార్టీ ఫిరాయింపులు, ప్రజా ప్రభుత్వాలను కూల్చే అనైతిక చర్యలు సాధారణంగా మారాయని, వాటికి అడ్డుకట్ట వేసిన పోరాటమే ఎన్టీఆర్ ఉద్యమమని గుర్తుచేశారు. ఆ ఉద్యమం ఫలితంగానే 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (52వ రాజ్యాంగ సవరణ) అమల్లోకి వచ్చిందని వివరించారు.
పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆయన పేరుతో నాణెం విడుదల చేయించడంలో తన వంతు కృషి చేయడం ద్వారా తండ్రి రుణం కొంతమేర తీర్చుకోగలిగానని పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న లిటరేచర్ కమిటీ సభ్యులను, చైర్మన్ టీడీ జనార్దన్‌ను ఆమె అభినందించారు.
కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ, తెలుగునాట రాజకీయాలను “ఎన్టీఆర్‌కు ముందు – ఎన్టీఆర్ తర్వాత” అని విభజించి చూడాల్సి ఉంటుందని అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు పాలించినప్పటికీ, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను భావి తరాలకు చేరవేయడమే కమిటీ లక్ష్యమని, ఇప్పటికే పలు పుస్తకాలు ప్రచురించడంతో పాటు ‘అన్న ఎన్టీఆర్’ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించామని తెలిపారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అతి సామాన్యుడైన తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేదవాడి ఆకలిని అర్థం చేసుకున్న మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ 1984 నాటి క్లిష్ట పరిస్థితులను గుర్తు చేస్తూ మాట్లాడారు. ఒకవైపు తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండగా, మరోవైపు తండ్రి అమెరికాలో గుండె శస్త్రచికిత్స చేయించుకుని వచ్చిన వెంటనే పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు విశ్రాంతి సూచించినా, ప్రజాస్వామ్యం కోసం ఎన్టీఆర్ పోరాడిన తీరును ఆయన స్మరించుకున్నారు.
కార్యక్రమం ప్రారంభంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని ఆలపించారు. రచయిత విక్రమ్ పూల తన పుస్తక విశేషాలను సభకు వివరించారు. ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రిని పురందేశ్వరి, టీడీ జనార్దన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత కేఎస్ రామారావు, రాజకీయ-సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
