Punjab: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని బజ్వా వెల్లడించారు. అంతేకాదు, ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు బీజేపీతో కూడా సంబంధాలు పెంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
“AAP ఎమ్మెల్యేలందరికీ ఇది చివరి అవకాశం అని వారు గ్రహించారని, అందుకే కొత్త పార్టీల వైపు చూస్తున్నారు,” అని బజ్వా వ్యాఖ్యానించారు.
భగవంత్ మాన్ భవిష్యత్తుపై ఊహాగానాలు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని బజ్వా ఆరోపించారు. “కేజ్రీవాల్ ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే, భగవంత్ మాన్ బీజేపీలో చేరతారు,” అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అసత్య ప్రకటనలు చేయలేదని స్పష్టం చేసిన బజ్వా, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని పేర్కొన్నారు. అయితే, ఆ పని బీజేపీ చేస్తుందని ఆయన ఆరోపించారు.
ఈ తాజా ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. AAP ఎమ్మెల్యేల అసంతృప్తి ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.