Punganuru Murder: కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా ఆ నియోజవకర్గంలో ఇంకా వైసీపీ పాలనే నడుస్తోందా? అక్కడ టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతకాల్సిందేనా? టీడీపీ ఇంచార్జ్ సైతం వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారా? పోలీసులు సైతం వైసీపీ నేతలకే వత్తాసు పలుకుతున్నారా? కార్యకర్తల ప్రాణాలు పోతున్నా అధికార పార్టీలో చలనం లేదా? ఈ రోజు అక్కడ చోటు చేసుకున్న దారుణానికి సమాధానం ఏది? ఇంతకీ ఏమిటా నియోజకవర్గం?
ఏపీలో టీడీపీ నేతల వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య జరిగి 24 గంటలు గడవక ముందే మరో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. మాజీ వాలంటీర్ అయిన వైసీపీ కార్యకర్త వెంకటరమణ కొడవలితో రామకృష్ణని నరికాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Punganuru Murder: రామకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు కన్నుమూశారు. హత్యకు గురైన రామకృష్ణ.. నాలుగైదు రోజుల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేశారు. వైసీపీ వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అందులో తెలిపారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వన్ సైడ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ. వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే శనివారం రామకృష్ణ దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది.
పుంగనూరు అనగానే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు కొత్తేమీ కాదు. కొన్ని నెలలు క్రితం పుంగనూరులో జరిగిన ఓ ఘటన అక్కడి టీడీపీ కార్యకర్తల పరిస్థితికి నిలువుటద్దం. వైసీపీ హయాంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పుంగనూరులో దౌర్జన్యానికి తెగబడ్డాడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు సురతోటి సురేష్ అలియాస్ చెంగలాపురం సూరి. ‘రేయ్ టీడీపీ జెండాలు పట్టుకుని ఎవడ్రా ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నారు? ఇది పెద్దిరెడ్డి అడ్డా.. మీరెలా వస్తార్రా?’ అంటూ అసభ్యంగా దూషించారు. వారు వేసుకున్న పసుపు చొక్కాలు విప్పించి.. పార్టీ కండువాలు, జెండాలు తీయించి.. నిర్బంధించి, అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.
Also Read: Noida: దారుణం.. పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మించి.. ఆరు నెలలుగా అత్యాచారం..!
Punganuru Murder: వైసీపీ హయాంలో పుంగనూరులో కొనసాగిన గూండా రాజ్యానికి తార్కాణంగా నిలిచిన ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు పెట్టి, ఇద్దర్ని అరెస్టు చేశారు. అయితే వారు గంటల వ్యవధిలోనే విడుదలై మరింతగా పేట్రేగిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. 9 నెలలైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి వైఖరితో పెద్దిరెడ్డి గూండాలు మరింత రెచ్చిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఇవాళ రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే హత్యకు గురయ్యాడు. అధికార పార్టీ నేతల్ని లెక్క చేయకుండా హత్యలకు పాల్పడుతున్నారంటే కారణాలు లేకపోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ పుంగనూరులో రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని వాపోతున్నారు టీడీపీ కార్యకర్తలు. బిక్కుబిక్కుమంటూ ప్రాణం వెళ్లబుచ్చుతున్నారు. ఉన్న ఇంచార్జి కూడా వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నా… అధిష్టానం వైపు నుండి చర్యలు లేవట. పోలీసులు కూడా వైసీపీ నేతలకే వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయ్. ఒకవైపు అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్నా పుంగనూరులో పెద్దిరెడ్డి గ్యాంగ్ అరాచకాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.